మీడియా సలహాదారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఇంధ‌న శాఖ‌, మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల (ఐ & ఐ) శాఖ‌, సీఆర్‌డీఏ

ఇంధన పొదుపుపై విస్తృత అవగాహన

 

  50 లక్షల మంది విద్యార్థులకు భాగస్వామ్యం

  జాతీయ స్థాయిలో ఉత్తమ పెయింటింగ్‌కు రూ.లక్ష బహుమతి

  రాష్ట్ర స్థాయిలో రూ.20 వేలు బహుమతి

  క్షేత్ర స్థాయిలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు

  సరఫరా నష్టాలను తగ్గించేందుకు హెచ్‌వీడీఎస్

  8 జిల్లాల్లో ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.6 వేల కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి

  రైతులకు 33 వేల ఇంధన సామర్థ్య, 34 వేల సౌర పంపుసెట్లు

 

తిరుపతి, అక్టోబరు 8: రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ ఇంధన సామర్థ్య గృహంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలకు విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఇంధన శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ), ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం).. నైపుణ్యాభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖల సహకారంతో ఇంధన పొదుపుపై పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నది. దశలవారీగా 50 లక్షల మంది విద్యార్థులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించనుంది. ఇందులో భాగంగా సోమవారం తిరుపతిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ, వ్యాస రచన పోటీలు పెట్టారు. ఇంధన పొదుపుపై క్షేత్ర స్థాయిలో అవగాహనను పెంచడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎం.ఎం.నాయక్ తరఫున ఆయన సందేశాన్ని ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి చదివి వినిపించారు. రోజువారీ జీవితంలో ఇంధన పొదుపును ఒక భాగంగా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా తాము భారీగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఇంధన పొదుపు కార్యక్రమాల్లో మరే రాష్ట్రం చేపట్టని విధంగా 50 లక్షల మంది విద్యార్థులను భాగస్వాముల్ని చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 70 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును బీఈఈ కూడా అభినందించిందన్నారు. హై ఓల్టేజీ పంపిణీ వ్యవస్థ(హెచ్‌వీడీఎస్) వంటి అనేక ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఏపీఎస్పీడీసీఎల్ ముందు వరసలో ఉందని చెప్పారు.

 

ఇంధన సామర్థ్య పంపు సెట్లు, ఎల్ఈడీ వీధి లైట్లు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం, అనంతపురం, కర్నూలులో 1500 మెగావాట్లు, 1000 మెగావాట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర పార్కులను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో ఏపీఎస్పీడీసీఎల్ ఇంధన పొదుపు కార్యక్రమాల అమలులో అగ్రపథంలో ఉందని సీఈవో వెల్లడించారు. రైతులకు సౌర పంపుసెట్ల పంపిణీలో దేశంలోనే ముందుందన్నారు. వ్యవసాయ రంగంలో 25 శాతం ఉన్న పంపిణీ నష్టాలను 10 శాతానికి తగ్గించే లక్ష్యంతో హెచ్‌వీడీఎస్‌ చేపట్టినట్లు తెలిపారు. రూ.4 వేల కోట్లతో ఇప్పటికే రైతులకు 10.07 లక్షల పంపుసెట్లను అందజేసినట్లు వివరించారు. పథకం అమలులో విద్యుత్ శాఖ సలహాదారు రంగనాథం పాత్ర ఎనలేనిదని నాయక్ కొనియాడారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు 32 వేల ఇంధన సామర్థ్య పంపుసెట్లు, 34 వేల సౌర పంపుసెట్లను అందజేసినట్లు తెలిపారు. ఒక్క ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలోనే 19 వేల పంపుసెట్లను అందజేశామని, మరో 36,128 పంపుసెట్లు కావాలంటూ ఈఈఎస్ఎల్‌కు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.

రాబోయే రెండు మూడేళ్లలో పంపిణీ నష్టాలను 5-6 శాతానికి పరిమితం చేసేందుకు రూ.10 వేల కోట్లతో నెట్ వర్క్ ను బలోపేతం చేయాలని నిర్ణయించారని.. ఇందులో రూ.6 వేల కోట్లను ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలోనే 8 జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇంధన పొదుపు కార్యక్రమాల అమలుపై ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, మంత్రి కళా వెంకట్రావుకు సమగ్ర నివేదిక అందిస్తారని తెలిపారు. ఇంధన పొదుపులో ఏపీని ప్రపంచంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలపడానికి ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలని అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులను కోరారు. ఇంధన పొదుపు అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఇంధన పొదుపును దినచర్యలో ఒక భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్టీపీసీతో కలిసి ఎస్ఈసీఎం విద్యార్థులకు ఇంధన సంరక్షణపై చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. 4-6, 7-8 తరగతుల విద్యార్థులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో రెండు ఉత్తమ పెయింటింగులకు రూ.20 వేల చొప్పున బహుమతి అందజేస్తామన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రలేఖనానికి రూ.లక్ష బహుమతి ఉంటుందని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి పోటీపడిన విద్యార్థులందరికీ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల, శ్రీ వెంకటేశ్వర బాలుర జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు నాయక్ తరఫున చంద్రశేఖర్ రెడ్డి బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు, ఏపీఎస్పీడీసీఎల్ సీజీఎం అయూబ్ ఖాన్, ఎస్ఈ చలపతి, సీతారామరాజు , వెంకటేశ్వర్లు , డైరెక్టర్ ఫైనాన్సు , చీఫ్ ఇంజనీర్, నంద కుమార్, , ఏపీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

టు: ద న్యూస్ ఎడిట‌ర్‌/ బ‌్యూరో చీఫ్‌ సీఈవో, ఎస్ఈసీఎం

మీడియా స‌లహాదారు , ఇంధ‌న శాఖ‌, &, సీఆర్‌డీఏ,
సెల్‌:
98488 58049